ysr-pension-app

YSR Pension App New Update – Face Authentication

వైయస్సార్ పింఛన్ల పంపిణీ సమయంలో బయోమెట్రిక్ లో వేలిముద్రలు పడక సమస్య వస్తే అవ్వాతాతలకు అదనపు సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు అవ్వాతాతల వేలిముద్రలు వాలంటీర్ల వద్ద ఉన్న యాప్లో పడక సరిపోలని పరిస్థితి ఎదురైతే.. ఆధార్ అనుసంధానంతో కూడిన లబ్ధిదారుని ముఖాన్ని అదే యాప్ లో సరిపోల్చుకొని పింఛన్ డబ్బులు పంపిణీ చేయనున్నారు.

వైయస్సార్ పింఛన్ల పంపిణీ కి సంబంధించిన యాప్ కొత్త వర్షన్ లో మార్చి 1 నుంచి ఈ అదనపు సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం తమ ఫోన్లలోని యాప్ ను అప్డేట్ చేసుకోవాలని వలంటీర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పింఛన్ల పంపిణీకి ఇప్పటికే అమలులో ఉన్న అన్ని విధానాలు ఇకపైనా అందుబాటులో ఉంటాయని.. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రల సమస్యలున్న వారి కోసమే ఈ ఆధార్ ముఖ గుర్తింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 63 లక్షల మందికి పైగా లబ్దిదారులకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో పింఛన్లు పంపిణీ చేస్తోంది. అందులో దాదాపు 2 లక్షల మంది అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ సమయంలో వేలిముద్రలు పడక సమస్య వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరందరికీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో కూడిన ఆర్బీఐఎస్ విధానంలో మరొక ప్రైవేటు యాప్ ద్వారా ముఖం సరిపోల్చుకొని పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆథార్ తో ఎలాంటి సంబంధం ఉండదు. సిబ్బంది ముందుగా వేలిముద్రలు పడని లబ్ధిదారుని ఫొటోను ఆ ప్రైవేటు యాప్ లో నమోదు చేస్తారు. ఆ ప్రైవేటు యాప్ వాలంటీర్ల పింఛన్ల పంపిణీ యాప్ లో ఒక భాగంగా అనుసంధానమై ఉంటుంది. ఆ ప్రైవేట్ యాప్ లో ముందే అప్లోడ్ చేసిన లబ్ధిదారుని ఫొటోతో.. వాలంటీర్ తీసిన ఫొటో సరిపోతే.. అతనికి పింఛను డబ్బులు పంపిణీ చేసేందుకు యాప్ ఒకే చెబుతోంది. అయితే కొన్నిసార్లు ఇందులో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అవ్వాతాతల సౌలభ్యం కోసం ఆధార్ ముఖ గుర్తింపు విధానం వినియోగానికి ప్రభుత్వం అనుమతి కోరగా.. యూఐడీఏఐ ఇటీవల అనుమతి ఇచ్చింది. దీంతో మార్చి 1 నుంచి వేలిముద్రల సమస్య ఉన్నవారికి ఆధార్ ముఖ గుర్తింపుతో కూడా పింఛన్ అందజేయనున్నారు.

5 thoughts on “YSR Pension App New Update – Face Authentication”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top