పంట సాగుదారు హక్కుల పత్రాలు (సీ.సీ.ఆర్.సీ) నియమ నిబంధనలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 76.24 లక్షల రైతులు 80.96 లక్షల హెక్టార్లలో వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో 65.75 లక్షల మంది చిన్న /సన్నకారు రైతులు వీరు 44.11 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మిగిలిన 36.85 లక్షల హెక్టార్లు ఇతర రైతులు, కౌలుదార్ల ద్వారా వ్యవసాయం చేయుచున్నారు. సుమారు 15.63 లక్షల మంది కౌలుదారులు, నోటి మాట ద్వారా కౌలుకి వ్యవసాయం చేయుచున్నారు.
ఈ కౌలుదారుల్లో స్వంత భూమి లేని కౌలుదారులు మరియు స్వంత భూమి కొంత చిన్న/ సన్నకారు రైతులు మరియు ఆర్.ఓ.ఎఫ్.ఆర్., సి.జె.ఎఫ్.ఎస్. రైతులు ఉన్నారు. కౌలు దారులకు చట్టం వలన భూమి యజమానులు కౌలు రైతులకు అధీకృత భూమిని వ్యవసాయం చేసుకొనుటకు ఇవ్వటానికి ఇష్టపడుటలేదు.
కౌలుదారులు వ్యవసాయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి 24 నుండి 48 శాతానికి అధిక వడ్డీకి ఇతరులపై ఆధార పడవలసి వస్తున్నది. దీనివలన రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని దివాలా తీసే పరిస్థితి ఎదురయి, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుచున్నారు.
ఈ పరిస్థితి నుండి రైతులను కాపాడుటకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కౌలు దారులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని ఈ ఉచ్చులలో నుండి కాపాడుటకు శ్రీకారం చుట్టినది.
ఇందులో భాగంగా ప్రభుత్వం పంట సాగు దారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, “ఆంధ్రప్రదేశ్ పంట సాగు దారు హక్కుల చట్టం, 2019” రూపొందించింది.
ఆంధ్రప్రదేశ్ పంట సాగు దారులు హక్కుల చట్టం, 2019 (సీ.సీ.ఆర్.సీ):
ఈ చట్టం ఆగస్టు 17, 2019 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం “పంట సాగు దారు హక్కు పత్రాన్ని (సీ.సీ.ఆర్.సీ)” జారీ చేస్తారు. ఈ చట్టం వలన ఇంతకు ముందు అమలులో ఉన్న “ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్ డ్ కల్టివేటర్స్ చట్టం, 2011” రద్దు కాగా, కౌలుదారు చట్టం 1956 ను రద్దు చేసే ప్రక్రియ జరుగుతోంది. కనుక ఇక నుండి ఋణ అర్హత కార్డులు (ఎల్.ఇ.సి) లు, పంట ధ్రువీకరణ పత్రాల (సి.జి.సి.),ను జారీ చేయబడవు.
పంట సాగుదారు హక్కుల పత్రాల పంపిణీ జూన్ నెల 30వ తేదీ వరకు కొనసాగించనుంది. రైతు భరోసా కేంద్రాల వద్ద సీ.సీ.ఆర్.సీ మేళాలను నిర్వహిస్తోంది. పంట సాగు దారు హక్కు పత్రాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో 6,87,474 మందికి సీ.సీ.ఆర్.సీ లు జారీ చేయగా, 2021 – 22 వ్యవసాయ సీజన్ కు సంబంధించి కొత్తగా మరో 5 లక్షల మందికి వాటిని జారీ చేయాలని నిర్ణయించింది.
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
- ఈ పత్రం భూ యజమానికి, సాగు దారునికి మధ్యగల ఒప్పంద పత్రం. దీని కాలపరిమితి 11 నెలలు (పత్రం జారీ చేసిన తేదీ నుండి). ఈ పత్రం పై గ్రామ సచివాలయం గ్రామ రెవెన్యూ అధికారి సాక్షి సంతకం చేస్తారు.
- ఈ సాగుదారులు హక్కు పత్రం లో భూ యజమాని సాగుదారులు పేర్లు, సర్వే నంబరు, ఆ పొలం ఉనికి, విస్తీర్ణం, దాని సరిహద్దు లు, పంటకాలం ఇత్యాది వివరాలను పొందుపరుస్తారు, ఈ పత్రం ద్వారా భూయాజమాన్య హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదు.
- ఈ చట్టంలోని సెక్షన్ 5 (C ) ప్రకారం, సాగుదారులు ఈ పత్రం ద్వారా రుణ అర్హత, పంటల బీమా, ఉత్పాదకాల సబ్సిడీ మరియు పంటనష్టం ఉపశమనం వంటివి మాత్రమే పొందగలరు. భూమి పై ఎటువంటి స్వాధీన హక్కు లు గాని సాగు మరియు ఇతర హక్కులు గాని పొందలేరు.
ప్రయోజనాలు:
- రాష్ట్రంలో 76,21,118 మంది రైతులు ఉండగా, వారిలో 16,00,483 మందికి కౌలుదారులు ఉన్నారు. సాగుభూమిలో 70 శాతానికి పైగా వీరు కౌలుకు చేస్తుంటారని అంచనా.
- ఆగస్టు 2019 లో అమలులోకి వచ్చిన పంట సాగు దారు హక్కుల చట్టం కౌలు రైతులకు రక్షణగా నిలిచింది. ఈ చట్టం కింద 11 నెలల కాలపరిమితి తో జారీ చేస్తున్న కౌలు హక్కు పత్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, రాయితీపై పొందడంతోపాటు తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500/- పెట్టుబడి సాయం అందుతుంది.
- ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల తో పాటు అన్ని వర్గాల కౌలు రైతులకు ప్రభుత్వం అమలుచేస్తున్న పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం ,ఉచిత పంటల బీమా వంటి అన్ని పథకాల లబ్ధిని పొందే వెసులుబాటు కల్పించింది.
కొత్త సీ.సీ.ఆర్.సీ /రెన్యువల్ ప్రక్రియ:
- భూ యజమానుల అంగీకారంతో ఇప్పటివరకు సీ.సీ.ఆర్.సీ లు పొందిన కౌలు రైతులు తమ పత్రాలను రెన్యువల్ చేసుకోవడంతో పాటు మరో 5 లక్షల మందికి కొత్తగా సీ.సీ.ఆర్.సీ లు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
- ఇందుకోసం ఎస్సీ ,ఎస్టీ , బిసి ,మైనారిటీ కౌలుదారులకు సీ. సీ. ఆర్. సీ లు జారీ చేసి వాటిని వైఎస్సార్ “రైతు భరోసా పోర్టల్” లో అప్ లోడ్ చేయించడం ద్వారా వారికి ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సహాయం అందించాలని సంకల్పించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి రైతు భరోసా లబ్ధి చేకూర్చాలని సంకల్పంతో ఈ నెల 30వ తేదీ వరకు సీ.సీ.ఆర్.సీ లు జారీ చేస్తారు.
భూమి యజమానులు నిర్భయంగా ముందుకు రావచ్చు
సీ.సీ.ఆర్.సీ పత్రాలపై సంతకం చేసే విషయంలో భూమి యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. 11 నెలల కాలంలో పండించిన పంట పై తప్ప భూమిపై కౌలుదారులకు ఎలాంటి హక్కులు ఉండవు. దీనివల్ల భూ యజమానులు కౌలు రైతులకు రాయితీపై విత్తనాలు, వైఎస్సార్ రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ ,ఇన్ పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, కనీస మద్దతు ధర రావటానికి సహకరించిన వారు అవుతారు. సాగు దారులకు సీ.సీ.ఆర్.సీ లు జారీ విషయంలో యజమానులు నిర్భయంగా ముందుకు రావచ్చు.
ఈ పత్రం, సాగు దారునికి పంట ఋణాలు పొందుటకు సహాయపడుతుంది. బ్యాంకర్లు కూడా, ఈ పత్రం గల సాగు దారునికి ఏ ఇతర పత్రాలను సమర్పించమని ఒత్తిడి తీసుకు రాకుండానే కేవలం ఈ పత్రం పై ఋణాలు ఇవ్వవచ్చు.
Thanks for the article
very good imformation…