పశుగ్రాస వారోత్సవములు – 2021 | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బహువార్షిక పశుగ్రాసాల సాగు |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశుగ్రాసాల అభివృద్ధి మరియు పరిరక్షణ ద్వారా పశుగ్రాస అవసరాలను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానం చేస్తూ ప్రతిపాదిత 25,000 వేల ఎకరాల్లో ఎంసిసి ల ద్వారా బహు వార్షిక పశుగ్రాసాలను పెంచడానికి మార్గదర్శకాలు జారీ చేసింది.
పని వివరములు : యూనిట్ సైజు – 0.25 ఎకరం
గడ్డి రకము : బహు వార్షికములు – హైబ్రిడ్ నేపియర్ రకాలైన ఎపి బి యన్ 1,CO-1, CO-2 & CO-3
భూమి వివరములు – వ్యక్తిగత/ అసైన్డ్ /సిపిఆర్/ ప్రభుత్వ భూమి
యూనిట్ పరిధి – ఉపాధి హామీ లబ్ధిదారులకు 2.50 ఎకరాల వరకు
సిపిఆర్/ ప్రభుత్వ భూమి వారికి 5.00 ఎకరాల వరకు
ఎకరం సాగు కొరకు యూనిట్ చార్జీ : రూ.83,654/-
లేబర్ విభాగం : రూ.45,030/-
మెటీరియల్ భాగం : రూ.38,624/-
వ్యక్తి పని దినాలు : 190
ఈ పథకాన్ని సొంత భూమి గల లబ్ధిదారుల అర్హతను బట్టి వ్యక్తిగత యూనిట్ ను మంజూరు చేయడం జరుగుతుంది. అదే విధముగా ప్రభుత్వ లేదా సిపిఆర్ భూమిలో పశుగ్రాస అభివృద్ధి కొరకు పాల సహకార సంఘాలు/ స్వయం సహాయక సంఘాలు /జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ సభ్యులకు /షెడ్యూల్డ్ కులాలు /షెడ్యూల్డ్ తెగలు/ చిన్న మరియు సన్నకారు రైతులు లబ్ధిదారులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం అర్హతను బట్టి మంజూరు చేయడం జరుగుతుంది.
వ్యక్తిగత యూనిట్ లబ్ధిదారులను ఈ క్రింది ప్రాధాన్యతా క్రమంలో అర్హతను బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది.
- షెడ్యూల్డ్ కులాలు
- షెడ్యూల్డ్ తెగలు
- సంచార జాతులు
- డి నోటిఫైడ్ తెగలు
- దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఇతర కుటుంబాలు
- గృహములో మహిళా యజమానిగా ఉన్న కుటుంబాలు
- వికలాంగుల నేతృత్వంలోని గృహాలు
- భూసంస్కరణల లబ్ధిదారులు
- ఇందిరా ఆవాస్ యోజన లబ్ధిదారులు
- షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసాలు క్రింద లబ్ధిదారులు.
- ప్రభుత్వము వారిచే గుర్తించబడిన చిన్న సన్నకారు రైతుల లో ఉపాధి హామీ పత్రం కలిగి ఉండాలి.
కుటుంబంలో ఏ ఒక్క సభ్యులైన వారి భూమిలో ఈ పథకం కింద పని చేయడానికి ఆసక్తి వ్యక్తీకరించిన కుటుంబాలను ఎంపిక చేసిన భూమిలో మార్క్ చేయడం, మస్టర్ రోల్ తీసుకోవడం, సంబంధిత పత్రాల నిర్వహణకు జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత వహిస్తారు. జరుగుతున్న పనుల పర్యవేక్షణకు గ్రామ పశుసంవర్థక సహాయకులు బాధ్యత వహిస్తారు. జరుగుచున్న అన్ని పనులను దశల వారీగా పర్యవేక్షించడం మరియు కొలతల తనిఖీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ నిర్వహిస్తారు. తదుపరి సంబంధిత పశువైద్యాధికారి జరిగిన పనులను 20% శాతం యాదృచ్చికంగా సూపర్ చెక్ చేస్తారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) లబ్ధిదారునికి పని ప్రారంభ పత్రాలను పనుల వారీగా అంచనాలతో తెలుగులో జారీ చేస్తూ సంబంధిత పశువైద్యునికి కూడా సమాచారం అందజేస్తారు. క్షేత్రస్థాయిలో ఈ పథక అమలులో ఏదైనా అదనపు పనుల నమోదు లేదా అదనపు చెల్లింపులు గుర్తించిన ఎడల సంబంధిత అధికారులు బాధ్యత వహిస్తారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో పశుగ్రాస అభివృద్ధికి సంబంధించి 190 రోజుల పనిదినాలను పొందిన ఉపాధి హామీ పాత్ర లబ్దిదారులు ఈ పథకం లో ఇతర పనులకు అనర్హులుగా గుర్తించాలి. కొలతల పుస్తకంలో నమోదు చేసిన కొలతల ప్రకారం మెటీరియల్ ఖర్చు నేరుగా రైతు/GP ఖాతాకు చెల్లించబడుతుంది.
పశుసంవర్ధక సహాయకులు పశుగ్రాస అభివృద్ధి పనులను గుర్తించి గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు పనులు మంజూరు చేయాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పశుపోషకుల నుండి సేకరిస్తారు. జాబ్ కార్డు, ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు వంటి పత్రాలను (జిరాక్స్ కాపీలు) కూడా పశుపోషకుల నుండి సేకరిస్తారు. సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించిన పత్రాన్ని పశువైద్యాధికారి సంతకంతో ఎంసిసి లకు అందజేస్తారు.
పశుగ్రాసం అభివృద్ధి మరియు పరిరక్షణ పనులు ఉపాధి హామీ పథకం క్రింద అమలు అయ్యేలా చూసేందుకు జిల్లా కలెక్టర్ మరియు ఉపాధి హామీ పథక అధికారులు పైన సవరించిన మార్గదర్శకాలను పాటిస్తారు.